నాన్న.. మరిచిపోలేని తిరిగిరాని ఒక జ్ఞాపకం..
ప్రేమ కురిపించే చూపు ప్రేమగా జనా అని పిలిచే పిలుపు నాకు జ్ఞాపకం..
నన్ను ఎత్తుకొని తోటకు తీసుకెళ్లిన నాన్న నాకు జ్ఞాపకం..
నన్ను వీపుమీద ఎక్కించుకుని బావిలో ఈత లాడించిన నాన్న నాకు జ్ఞాపకం..
అడగకుండానే నాకిష్టమైన మిరపకాయ బజ్జీలు తెచ్చిన నాన్న నాకు జ్ఞాపకం..
అమ్మ ఊరెళ్ళినప్పుడు నాన్న వండిన వంకాయ పప్పు రుచి ఇప్పటికీ నాకు జ్ఞాపకం..
స్కూలుకెళ్లకుండా బయట తిరుగుతున్న నన్ను వైర్ తో దండించిన నాన్న నాకు జ్ఞాపకం..
నాకు క్యారెమ్స్ నేర్పించి నువ్వు గురువును మించిన శిష్యుడివిరా అని పొగిడిన నాన్న నాకు జ్ఞాపకం..
పాత పాటలన్నీ నాకు వినిపించి పాత సినిమా వచ్చినపుడల్లా థియేటర్ కి తీసుకెళ్లిన నాన్న నాకు జ్ఞాపకం..
తను పనిచేసే కాలేజ్ కి తీసుకెళ్ళి ల్యాబ్ లో పరికరాలన్నీ చూపించిన నాన్న నాకు జ్ఞాపకం..
నిజాయితీగా పనిచేసి, నీతి నిజాయితీలకు ఉండే గౌరవం ఏంటో చూపించిన నాన్న నాకు జ్ఞాపకం..
చదువుకొమ్మని ప్రోత్సహించి చదువు కన్నా సంస్కారం గొప్పదని చెప్పిన నాన్న నాకు జ్ఞాపకం..
నన్ను ప్రయోజకున్ని చేసి నా పెళ్లి కూడా చూడకుండా వెళ్లిపోయిన నాన్న నాకు జ్ఞాపకం..
ఒక్కడుగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి నాకోసం ఇద్దరుగా తిరిగొచ్చిన నాన్నా నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం..
Commenti