ఈరోజు సాయంత్రం మా అబ్బాయి నా దగ్గరకొచ్చి, నాన్న నాకు కాలిక్యులేటర్ కావాలి అని అడిగాడు, నాకు వెంటనే మా నాన్న గుర్తుకు వచ్చాడు. చిన్నప్పుడు నేను కూడా ఒక రోజు ఇలానే మా నాన్నను అడిగాను, నాన్న మాథ్స్ టీచర్ కాలిక్యులేటర్ తీసుకురమ్మంది కొనివ్వు నాన్న అని. మా నాన్న ఇప్పుడు డబ్బులు లేవురా ఉన్నపుడు కొనిస్తాను అన్నాడు, కానీ నేను వినకుండా నాక్కావాల్సిందే అని ఏడ్చాను, మా నాన్న ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. కాలిక్యులేటర్ కొనాలంటే మా నాన్న జీతం లో 10% పెట్టాలి అని ఆలోచించేటంత వయస్సు తెలివి లేవు అప్పుడు.
మూడు రోజుల తర్వాత మా నాన్న కొత్త కాలిక్యులేటర్ తెచ్చి ఇచ్చాడు, చాలా ఆనందపడ్డాను, క్లాస్ కి తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి కూడా చూపించాను. మళ్లీ తర్వాత రోజే మా నాన్న కాలిక్యులేటర్ తీసుకెళ్లిపోయాడు, ఎందుకు నాన్న అంటే పలకలేదు, నేను ఏడ్చేశాను, కోపంతో నాన్నతో మాట్లాడడం కూడా మనేశాను.
చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, నాన్న రిటైర్ అయ్యారు, నేను చదువు కంప్లీట్ చేసి జాబ్ లో జాయిన్ అయ్యాను. ఒకరోజు ఇంట్లో అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం, అప్పుడు TV లో కాలిక్యులేటర్ సీన్ వచ్చింది, అప్పుడు అడిగాను మా నాన్నని, నాన్న నువ్వు ఎందుకు కాలిక్యులేటర్ కొనిచ్చావ్, ఎందుకు మళ్లీ తీసుకెళ్లావు అని. అప్పుడు చెప్పాడు మా నాన్న "నువ్వు కాలిక్యులేటర్ అడిగిన రోజున, మా ల్యాబ్ లో(మా నాన్న కాలేజీ లో ల్యాబ్ లో పని చేసేవారు) ఎవరో కాలిక్యులేటర్ మర్చిపోయి వెళ్లారు, 2 రోజులు చూశాను ఎవరైనా వచ్చి అడుగుతారేమో అని, కానీ ఎవ్వరూ రాలేదు, సరే అని తీసుకొచ్చి నీకిచ్చాను. తర్వాత రోజు మధ్యాహ్నం ల్యాబ్ కి లాక్ చేసి బయటకు వస్తుండగా ఒక అమ్మాయి వచ్చి, అంకుల్ 3 రోజుల కిందట నేను ల్యాబ్ లో కాలిక్యులేటర్ మర్చిపోయాను, అది కూడా కొత్తది, మీరేమైన చూశారా అని అడిగింది!! ఎక్కడో ఆలోచిస్తూ(మనసు రాయి చేసుకుని లేదు అని అబద్దం చెప్దామని అనుకున్నా), మళ్లీ ఈ లోకంలోకి వచ్చి, ఆ వుందమ్మా కానీ ల్యాబ్ లాక్ చేసాను, లంచ్ తర్వాత వచ్చి తీసుకెళ్లు అన్నాను, లంచ్ కి ఇంటికి వచ్చినప్పుడు మళ్లీ తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చాను" అది రా జరిగింది అన్నాడు. కళ్లల్లో నీళ్ళు తిరిగాయి, నన్ను నేను తిట్టుకుంటూ మా నాన్న చెయ్యి పట్టుకుని క్షమించు నాన్న అని అడిగాను. 5 నిముషాల తర్వాత మళ్ళీ అడిగాను మరి ఆరోజే ఎందుకు చెప్పలేదు నాన్న అని. మా నాన్న అన్నాడు "ఎలా చెప్పను రా ల్యాబ్ లో ఎవరిదో తెచ్చాను అని (పిల్లలకు నేను నేర్పేది ఇదేనా అని నన్ను నేనే ప్రశ్నించుకుని), నేను ఆ కాలేజ్ లో పని చేసినంత కాలం మీకు చెప్పకూడదు అనుకున్నా".
మా నాన్న నిజాయితీకి మనసులోనే సెల్యూట్ చేసుకున్నా. అందుకే ఎవరైనా మీ నాన్న నీకిమిచ్చాడు రా అని అడిగితే నేను గర్వంగా అంటాను "దొంగతనం వద్దు మంచి మార్గంలోనే వెళ్ళు, వీలైతే సాయం చెయ్యి కానీ ఎవ్వరిని మోసం చేయొద్దు, నలుగురితో కలిసి జీవించడం నేర్చుకో" ఇలాంటి మంచి మాటలని, మంచి అలవాట్లను అన్నింటిని మించి "నిజాయితీ"ని ఇచ్చాడు అని.
ఓకే, మా అబ్బాయికి కాలిక్యులేటర్ ఆర్డర్ పెట్టాలి లేదంటే వాడు నాతో మాట్లాడడం మనేస్తాడు మళ్లీ..
Comments