ఒక సాయంత్రం.
సూర్యాస్తమయానికి కొన్ని నిముషాల ముందు.
మనసు బాగలేక అలా నడుచుకుంటూ ఊరి బయట ఉన్న వంక దగ్గరికి వచ్చాను.
ఒక పక్క అరటి చెట్లు, ఇంకో పక్క వంకలో గలగల పారే నీరు, ఆ నీటి చివర అస్తమించడానికి సిద్ధపడుతున్న భాస్కరుడు..
ఆ సన్నివేశం చూడ్డం అంటే నాకు చాలా చాలా ఇష్టం, అది చూడటానికే ఎన్నో రోజులు అక్కడికి వచ్చాను..
అలా చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉండేది, కానీ ఈరోజు మనసెందుకో ఇంకా బాధ పడుతూనే వుంది, చాలా కారణాలు..
ఇంతలో కొంత దూరంలో ఉన్న రంగనాథ స్వామి గుడిలోంచి భగవద్గీత శ్లోకాలు మొదలయ్యాయి..
"పార్థాయ ప్రతి బోధితాం, భగవతా నారాయనే.."
కానీ మనసు మాత్రం కుదుట పడట్లేదు, మనస్సు పరిపరి విధాలా ఎక్కడికో పోతోంది, ఆరోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తున్నాయ్..
1. పదిసార్లు సహాయం పొందిన వ్యక్తికి పదకొండోసారి సహాయం చెయ్యడం కుదరకపోతే అతను నన్ను శత్రువులా చూడటం, మొదటి సారే సహాయం చెయ్యనని చెప్పిన వ్యక్తి అతనికి మిత్రుడు అవ్వటం..
2. నిన్న రాత్రి బస్టాప్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తిని కొందరు ఆడ వేషంలో ఉన్న మగాళ్లు డబ్బుల కోసం వేధించడం, అది చూసి ఊరుకోలేక, ఒక్కడినే ఏమీ చెయ్యలేక, అక్కడున్న వాళ్ళని రండి అతనికి సహాయం చేద్దాం అని బ్రతిమిలాడినా వాళ్ళు కదలకుండా నిలబడటం..
3. మనస్ఫూర్తిగా సహాయం చేసినా కూడా, సహాయం పొందిన వ్యక్తి , నాకు కుళ్ళు, స్వార్థపరుడు అని బిరుదులు ఇవ్వడం..
4. ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో వచ్చినవాడిని ఏంటిది అని ప్రశ్నిస్తే వాళ్ళు కార్ దిగి కొట్టడానికి రావడం..
ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లాగే వున్నా, ఒక మనిషి జీవితాన్ని, అతని గమనాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే అంశాలే, ఇవన్నీ మనస్సును తొలిచివేస్తున్నాయ్..
నేనే తప్పులు చేస్తున్నానా లేదా నేను చేసింది తప్పు అవుతోందా?
ఇంక ఈ సమాజంలో ఎలా ఉండాలి, ఏమ్ చెయ్యకూడదు, ఏమ్ చెయ్యాలి అని ఆలోచిస్తుండగా..
"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" అనే శ్లోకం వినిపించింది, దీనర్థం
( నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి )
మనస్సు కొంచెం కుదుట పడింది, కానీ ఆలోచనలు వీడటం లేదు..
ఈ సమాజంలో ఎవ్వరికీ భాద్యత లేదు, అవతలి వాడంటే ఇష్టం లేదు, ఇతరుల ఎదుగుదల అంటే కుళ్ళు..
ఇంక రాబోయే తరాల్ని తలుచుకుంటే బాధగా వుంది, మనమే ఇలా ఉన్నామే ఇంక మన పిల్లలకు కష్టసుఖాలు చెప్పుకోడానికి కనీసం ఒక తోబుట్టువు కూడా లేకుండా ఒక్కర్నే కనాలి అనుకుంటున్నారు, అవసరమైతే వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు, సహాయం చేసేవాళ్ళు ఎవరు, తలచుకుంటేనే భయంగా బాధగా వుంది..
అప్పుడే ఇంకో శ్లోకం వినిపించింది..
"దుఃఖములు కలిగినప్పుడు దిగులుచెందని వాడునూ, సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును స్థితప్రజ్ఞుడనబడును"
ఇది విని మనస్సును ఇంకొంచెం స్థిమితం చేసుకున్నాను, కానీ ఇంకా ఎదో వేధిస్తోంది..
ఈ సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న స్వార్థం, తరిగిపోతున్న ధర్మం..
కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి, డబ్బులు మాత్రమే కావాలి, ఎక్కడ చూసిన మోసం మోసం..
ఎలా ఎలా ఈ సమాజాన్ని ఎవరు బాగు చేస్తారు, ఎవరు వచ్చి చెప్తే అందరు వింటారు, మారతారు, నా వంతు నేనేమైన చేయగలనా? అని ఆలోచిస్తూ ఉండగా,
మరో శ్లోకం వినిపించింది..
"పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతాం, ధర్మసంస్థాపనాయ సంభవామి యుగే యుగే"
ఇది విన్నాక మనస్సు పూర్తిగా కుదుట పడింది..
ఇంక ఎక్కువ ఆలోచించద్దు అవసరమైనప్పుడు వస్తానని తానే అంటున్నాడు కదా ఆ కృష్ణ పరమాత్మ..
ఇంతలో ఫోన్ వచ్చింది "కృష్ణ చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు వచ్చేటప్పుడు తీసుకుని రండి" అని
అన్ని ఆలోచనలనుంచి బయటపడేసిన ఆ కృష్ణుడికి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ నా కర్మ నేను చెయ్యడానికి ఇంటికి బయలుదేరాను..
"కృష్ణం వందే జగద్గురుమ్"
Comentários