Goa, Anjuna Beach!!
సమయం రాత్రి సుమారు 10 గంటలు..
అప్పుడప్పుడే పర్యాటకులు బీచ్ వదిలి వెళ్ళిపోతున్నారు, అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతోంది..
అలా రాళ్ల మీద నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న ఒక ఎత్తయిన రాయి మీద సముద్రం వైపుకేసి కూర్చున్నాను..
ఇంతలో ఒక అల వచ్చి బలంగా నా కాళ్ళను కొట్టింది, భళే అనిపించి సన్నగా నవ్వాను..
కొద్దిసేపటికి ఆ అల మళ్ళీ వచ్చి ఈ సారి బలంగా నా మొహం మీద కొట్టింది, కొంచెం గాభరాపడి వెనక్కు జరిగి కూర్చున్నాను, నా నవ్వు చూసి కోప్పడిందేమో అనుకొని మళ్ళీఆ సన్నగా నవ్వాను..
ఈసారి ఇంకా వేగంగా వచ్చి మళ్లీ మొహం మీద కొట్టింది, కంగారుపడి ఎత్తయిన రాయి దిగి పక్కనే ఉన్న చిన్న రాయి మీద నిలబడి చూడసాగాను..
ఆ అల పదే పదే ఆ ఎత్తయిన రాయికేసి బలంగా కొడుతోంది, అంతలా ఎత్తయిన రాయిమీద ఏముందా అని అలా పైకి చూశాను..
ఆశ్చర్యం!! శుక్లపక్షం చివరి రోజు కు చేరుకున్న గుండ్రటి చంద్రుడు ఆ చుక్కల మధ్యలో మెరుస్తూ కనిపించాడు..
మళ్లీ సముద్రంకేసి పరిశీలించి చూశాను, ఆ పున్నమి వెన్నెల సముద్రమంతా తెల్లటి చాపలా పరవబడింది..
అప్పుడర్థమయ్యింది, చల్లని వెన్నెల పంచుతున్న ఆ చంద్రున్ని అందుకోవడానికి అలలు పైపైకి ఎగురుతున్నాయి..ఆహా!!
మళ్ళీ ఆలోచనలో పడ్డాను..
అప్పుడనిపించింది, అసాధ్యం అని తెలిసికూడా చంద్రున్ని అందుకోవడానికి ఆ అలలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి, మరి ఒక పని సాధ్యమని తెలిసి కూడా మనిషి దాన్ని సాధించడానికి కనీస ప్రయత్నం ఎందుకు చేయడా అని!!
పరిశీలించి చూస్తే ప్రకృతి మనకు అన్నీ నేర్పుతుంది, అదే మన మొదటి గురువు..
Comments